హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో "పుష్ప-2" ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. సంధ్య థియేటర్‌కు ప్రేక్షకులు భారీగా తరలి రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన అన్నారు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ తప్పేమీ లేదని, బన్నీని నిందించాల్సిన అవసరం లేదని, ఎక్కు మంది జనాలు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పారు.
దక్షిణాది ప్రేక్షకులకు తమ అభిమాన హీరోలపై అభిమానం ఎక్కువగా ఉంటుందన్నారు. తమిళ స్టార్ అజిత్ నటించిన ఒక సినిమాకు అర్థరాత్రి షోకు తాను వెళ్లాలనని, దాదాపు 20 వేలమంది థియేటర్ దగ్గర ఉన్నారని, సినిమా థియేటర్ వద్ద అంతమందిని చూడటం తనకు అదే తొలిసారన్నారు. సినిమా పూర్తయ్యాక తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వచ్చినపుడు కూడా అంతే మంది ప్రేక్షకులు థియేటర్ బయట ఎదురు చూస్తున్నారని చెప్పారు.
అగ్ర హీరోలు చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి వారు నటించిన చిత్రాలకు ప్రేక్షకులు ఇలాగే వస్తారని బోనీ కపూర్ తెలిపారు. జనాలు ఎక్కువ వచ్చినందుకే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.