చిరంజీవి, రాంచరణ్, అభిషేక్ అగర్వాల్‌ కు అందిన రామ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వానం

డీవీ

శనివారం, 13 జనవరి 2024 (18:36 IST)
chiru with Vishwa Hindu Parishad leaders
జనవరి 22న అయోధ్యలో రామ  విగ్రహ ప్రతిష్టాపన జరగనున్న నేపథ్యంలో దేశమంతా గొప్ప భావోద్వేగ స్థితిలో ఉంది . కాగా ఈ కార్యక్రమానికి హాజరు కావలసినదిగా   దేశ వ్యాప్తంగా  వివిధ రంగాలకు చెందిన రెండు వేల మంది  ప్రముఖులకు ఆహ్వాన పత్రాలను అందించే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తుంది శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్.  ఈ ఆహ్వాన పత్రాలను ఆయా ప్రముఖులకు స్వయంగా అందజేసే బాధ్యతను విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు  గుర్రం సంజీవ రెడ్డి , జాయింట్ సెక్రెటరీ శశిధర్ రావినూతల బృందానికి అప్పగించగా వారు  ఆహ్వాన పత్రాన్ని మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. 
 
ఈ సందర్భంగా  చిరంజీవి మాట్లాడుతూ "అయోధ్యలో రామాలయ నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్టాపన  అన్నవి వందల సంవత్సరాల  నిరీక్షణకు కార్యరూపంగా భావిస్తున్నాను. ఇలాంటి ఒక చారిత్రాత్మక ఘట్టంలో పాలుపంచుకోవడం గొప్ప అదృష్టం. ఈ ఆహ్వానాన్ని  నాకు అందజేసిన రామ జన్మభూమి ట్రస్టు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత గొప్ప కార్యక్రమానికి నేను సతీసమేతంగా హాజరు అవుతున్నాను "  అన్నారు . 
 
విశ్వహిందూ పరిషత్తు   నాయకులు గుర్రం సంజీవ రెడ్డి మాట్లాడుతూ " తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి ఆహ్వానాన్ని మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారికి వారి స్వగృహానికి వెళ్లి, state guests గా హాజరు కావాలని కోరాము.  ఈ సందర్భంగా ఆయన  ఆదరంగా  రిసీవ్ చేసుకోవటమే కాకుండా ఆలయ నిర్మాణ విశేషాలతో పాటు అందుకు  జరిగిన సుదీర్ఘ న్యాయపోరాట వివరాలను కూడా  చెప్తుంటే మాకే ఆశ్చర్యంగా అనిపించింది. స్వయంగా ఆహ్వానం అందిస్తూ చిరంజీవి గారితో మేము గడిపిన అరగంట సమయం మాకొక ఉద్విగ్న భరిత  అనుభవంగా నిలిచిపోతుంది"  అన్నారు.
 
 ఇదిలా ఉండగా ఆ రోజు రామ్ చరణ్ ఊరిలో లేని కారణంగా నిన్న ముంబై నుండి ప్రత్యేకంగా విచ్చేసిన  జాతీయ నాయకులు సునీల్  అంబేకర్  రామ్ చరణ్ ఉపాసన దంపతులను రామ విగ్రహ స్థాపన లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డు అందజేయడం జరిగింది. రాంచరణ్ కూడా ఈ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరవుతారు.
 
Abhishek Agarwal - Vishwa Hindu Parishad leaders
నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ కు ఆహ్వానం  
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్‌ .. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబడే కొన్ని ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌లను లైన్ అప్ లో ఉంచారు.
 
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు అభిషేక్ అగర్వాల్‌. ఈ మహత్తర కార్యక్రమానికి ఆహ్వానించబడిన వారిలో మెగా స్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి ప్రముఖులు వున్నారు.
 
ఈ ఆహ్వానం అందుకోవడం గౌరవంగా వుందని పేర్కొన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. “అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి వెళ్లి చరిత్రను తిలకించడం గొప్ప భాగ్యం. నా జీవితం భగవాన్ శ్రీరామునిచే ఆశీర్వదించబడింది, మర్యాద పురుషోత్తముని అపూర్వ ఘట్టాన్ని చూసే అవకాశాన్ని నాకు కల్పించింది'' అని ట్వీట్ చేశారు నిర్మాత. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు