తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున వేసిన క్రిమినల్ పరువునష్టం దావాపై హైదరాబాద్ నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
"మా కుటుంబంపై మంత్రి సురేఖ రాజకీయ దురుద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేశారు. వాటివల్ల మా కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలి" అని నాగార్జున గత గురువారం నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
కాగా, అక్కినేని నాగ చైతన్య, సమంతల విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.