Actor Allu Arjun Sent To Judicial Custody అల్లు అర్జున్‌కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పాటు హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో అల్లు అర్జుున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అక్కడ కొద్దిసేపు విచారణ జరిపిన తర్వాత అరెస్టు చేసినట్టు ప్రకటించి, నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ... 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు, తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ విచారణ తర్వాత హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనన్న ఉత్కంఠత సర్వత్రా నెలకొనివుంది. మరోవైపు, శని, ఆదివారాలు సెలవు కావడంతో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ అది సోమవారమే విచారణకు వచ్చే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.