ప్రతిష్టాత్మక తెలుగు బిగ్ బాస్ షో రెండో రోజే హౌజ్‌లో వార్ మొదలైంది. ముందుగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివజ్యోతి, రవిక్రిష్ణ, అషూ.. బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం అడిగిన ప్రశ్నలకు తర్వాత రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, వితిక, శ్రీముఖి, జాఫర్ సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని వారికి అనిపించడంతో ఈ ఆరుగురిని నామినేట్ చేశారు. హేమ పర్యవేక్షణలో ఈ ఆరుగురు నామినేషన్ నుండి తప్పించుకోవడానికి టాస్క్‌లోకి దిగారు.
టాస్క్‌లో భాగంగా మొదటి బెల్ మోగగానే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన నామినేషన్ మార్పు కోసం శివజ్యోతిని ఎంపిక చేసుకున్నాడు. అందుకు గల కారణాలు వివరించాడు. ఇద్దరి వాదనలు విన్న మానిటర్ హేమ .. రాహుల్‌నే మళ్లీ నామినేట్ చేయాల్సిందిగా బిగ్‌బాస్‌ను కోరింది. దీంతో ఈ వారం ఇంటి నుండి వెళ్ళిపోయే వ్యక్తులలో తొలి వ్యక్తిగా రాహుల్ చేరాడు.
ఆ తర్వాత రెండో బెల్‌కి వరుణ్ సందేశ్ లివింగ్ రూంలో తన తోటి సభ్యుల ముందు నిలుచొని పునర్నవి భూపాలంతో నామినేషన్ మార్పు చేసుకుంటానన్నాడు. దీనికి పునర్నవి తనదైన శైలిలో వివరణ ఇచ్చుకున్నప్పటికి, హేమ మాత్రం వరుణ్ సందేశ్‌ని సేవ్ చేసి పునర్నవి భూపాలంని నామినేట్ చేసింది. ఇక మూడో బెల్‌కి వచ్చిన వితికా షెరు.. అషూ రెడ్డిని సెలక్ట్ చేసుకుంది. వీరిరివురి వివరణ విన్న హేమ ..అషూనే బిగ్ బాస్ హౌజ్‌లో ఉండాలని భావించి వితికాని నామినేట్ చేసింది.
ఇక నాలుగో బెల్‌కి యాంకర్ శ్రీముఖి తన ఫ్రెండ్ అయిన హిమజతో నామినేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటానని చెప్పింది. అందుకు గల కారణం లైఫ్‌లో హిమజ ఏదైన లైట్ తీసుకుంటుందని, అంతేకాక ఉదయాన్నే తాను చేసిన పనిని హేమకి చెప్పుకుందని వివరించింది. దీనిపై సీరియస్ అయిన హిమజ తన పర్సనల్ లైఫ్ గురించి శ్రీముఖికి ఏం తెలుసు.
ఎంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానో తెలుసా? నా పేరు పక్కన ఉన్న రెడ్ మార్క్ పోగొట్టుకునేందుకే నేను పొద్దున్నే లేచి అంతా పని చేశాను. నేను చేసిన పని చెప్పడానికి ఎవరు లేని కారణంగా నా గురించి నేనే చెప్పుకున్నాను. నేను నిందలు అస్సలు పడను అంటూ కన్నీరు పెట్టుకుంది. శ్రీముఖి క్షమాపణలు చెప్పినప్పటికి హిమజ తనపై చేసిన నిందలని లైట్ తీసుకోలేకపోయింది.
వాడి వేడిగా జరిగిన చర్చ తర్వాత మానిటర్ హేమ.. శ్రీముఖిని సేవ్ చేస్తూ హిమజనే నామినేట్ చేసింది. కొద్ది సేపటి తర్వాత కన్ఫెషన్ రూంలోకి వెళ్లి కూడా బిగ్ బాస్‌కి తన గోడు చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది హిమజ. అంత ఏడుస్తున్నప్పటికి కనీసం తన ఫ్రెండ్ రోహిణి కూడా ఓదార్చలేదని మరింత భావోద్వేగానికి గురైంది హిమజ.