ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రంతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని నటుడు నవీన్ పోలిశెట్టి చెప్పారు. పైగా, గతంలో ఇంటిపేరును నాశనం చేస్తున్నావంటూ ఇంట్లో వారందరూ తిట్టేవారని ఆయన గుర్తు చేశారు. మిస్ శెట్టి... మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్‌ను చూసిన తన తండ్రి ఎంతో ఆనందించారని చెప్పారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో నవీన్ పోలిశెట్టి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు.
'నేనొక ఇంజినీర్. ఉద్యోగం పక్కనపెట్టి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టా. మంచి సంపాదన వదిలేసి సినిమా పరిశ్రమలోకి వచ్చానని నా తల్లిదండ్రులు ఎంతో కోప్పడ్డారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'కు ముందు దాదాపు పదేళ్లపాటు ఇంటి పేరు పాడుచేస్తున్నానంటూ తిట్టారు. ఇప్పుడు నా వల్ల మావాళ్లు ఎంతో ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు సినిమా టైటిల్‌లో మా ఇంటి పేరు ఉండటం చూసి నాన్న ఎంతో ఆనందించారు' అని చెప్పారు.
'జాతిరత్నాలు' ఆ స్థాయిలో ఆదరణ అందుకుంటుందని మేము అస్సలు ఊహించలేదు. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ఒత్తిడికి లోనయ్యా. అలాంటి సమయంలో అనుకోకుండా ఒక మహిళా అభిమానిని కలిశా. కాలిన గాయాలతో ఉన్న ఆమె నన్ను చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. నాకూ కన్నీళ్లు వచ్చేశాయి. ఆమె నన్ను ఎంతలా అభిమానిస్తున్నారో తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యా. నన్ను ఇంతలా ఆదరిస్తున్న వాళ్లకు మంచి వినోదాన్ని అందించాలని ఫిక్స్ అయ్యా. ఎన్నో కథలు విన్నా. 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' నాకెంతో నచ్చింది. అందుకే, ఈసినిమా ఓకే చేశా. హీరోయిన్‌గా అనుష్కను ఎంచుకున్నారని తెలిసి మొదట ఆశ్చర్యపోయా. ఆమెతో కలిసి వర్క్ చేయడం సరదాగా అనిపించింది' అని నవీన్ తెలిపారు.