కాగా, సుశాంత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా, ఇప్పటికే అనేక మంది వద్ద విచారణ జరిపిన సీబీఐ అధికారులు... సుశాంతి ప్రియురాలైన రియా చక్రవర్తి వద్ద కూడా విచారణ జరపాలని నిర్ణయించి, ఆమెకు సమన్లు పంపించారు. దీంతో ఆమె శుక్రవారం ఉదయం ముంబైలోని డీఆర్‌డీవో అతిథిగృహానికి వచ్చింది. అక్కడే సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమెతో పాటు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానీని కూడా సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నించనున్నాను.
కాగా, గురువారం రియా సోదరుడితో పాటు, సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులను కూడా అధికారులు విచారించారు. కాగా, రియా తన కుమారుడిని మానసికంగా వేధించి, డబ్బులు తీసుకుందని సుశాంత్ తండ్రి ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుశాంత్ ఇంట్లో పనిచేసే వారిని సీబీఐ అధికారులు ప్రశ్నించగా పలు విషయాలు బయటపడ్డాయి.
తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆమె, సుశాంత్‌ను కడసారి చూసేందుకు మార్చురీ వద్దకు వెళ్లానని, అక్కడ కూడా చాలా సేపు నన్ను లోనికి అనుమతించలేదని, మృతదేహాన్ని వ్యాన్ ఎక్కిస్తుంటే కేవలం మూడు నాలుగు సెకన్లు మాత్రమే చూశానని చెప్పారు.
ఆసమయంలో 'సారీ బాబూ' అని రియా వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, జీవితాన్ని కోల్పోయి, మరణించిన ఓ వ్యక్తిని క్షమించమని కోరడం మినహా తాను ఇంకేం చేయగలనని ప్రశ్నించారు. గౌరవంతో అతని పాదాలను తాకానని, భారతీయుడు ఎవరైనా దీన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. సుశాంత్ కుటుంబీకులకు తానంటే ఇష్టం లేదని, అందుకే తనను కష్టాలు చుట్టుముట్టాయని ఆవేదన వ్యక్తం చేసింది.