బైకుల్లా జైలుకు రియా చక్రవర్తి... నేరం నిరూపితమైతే పదేళ్ళ జైలు!

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:55 IST)
మాదకద్రవ్య వ్యాపారులతో సంబంధాలు కలిగివున్నాయన్న ఆరోపణలపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో ప్రవేశపెట్టగా, 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. 
 
ఇదిలావుండగా, ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను బుధవారం ఉదయం జైలుకు తరలించారు. మరోవైపు, ముంబైలోని ఓ సెషన్స్ కోర్టులో ఆమె మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అంతకుముందు కింది కోర్టులో రియా బెయిల్ పిటిషన్‌పై జరిగిన వాదనల్లో రియాకు బెయిల్ ఇవ్వకూడదని ఎన్సీబీ వాదించింది. కోర్టుకు అందజేసిన నివేదికలో రియాపై తీవ్ర అభియోగాలను మోపింది. డ్రగ్స్ సిండికేట్‌లో రియా కీలక సభ్యురాలు అని తెలిపింది. 
 
ప్రతి డ్రగ్ డెలివరీ, పేమెంట్ వివరాలు ఆమెకు తెలుసని పేర్కొంది. శామ్యూల్ మిరండా, దీపేశ్ సావంత్ కూడా సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేసేవారని... వాటికి సుశాంత్, రియా ఇద్దరూ డబ్బులు చెల్లించేవారని వారిద్దరూ వెల్లడించారని తెలిపింది. మరోవైపు ఈ ఆరోపణలు నిరూపితమైతే చట్టం ప్రకారం రియాకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు