బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో విధంగా మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా, ఈ కేసులోని అంశాలు సినీ ఫక్కీల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సుశాంత్‌ను హత్యచేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే సుశాంత్ గదిలోకి వెళ్లి లాక్ చేసుకున్నాడన్న సంగతి ఆయన సోదరికి చెప్పిన వ్యక్తి ఓ తెలుగు కుర్రోడని తేలింది. అతని పేరు పితాని సిద్ధార్థ్. పైగా, లాక్ చేసిన గది తలుపులను దగ్గరుండి తెరిపించింది కూడా సిద్ధార్థే అని తాజాగా వెల్లడైంది. అంతేకాకుండా.. రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటూ తనపై సుశాంత్ కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారంటూ సిద్ధార్థ్ ఇపుడు ముంబై పోలీసులకు ఓ మెయిల్ రాయడం సంచలనంగా మారింది.
అసలు, సుశాంత్ వద్దకు ఈ తెలుగు కుర్రోడు ఎలా చేరాడో తెలుసుకుందాం. పూర్తిపేరు పితాని సిద్ధార్థ్. సినిమాలపై మోజుతో జైపూర్‌లో ఓ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిద్ధార్థ్‌ను సుశాంత్ గుర్తించాడు. అతడిలో ప్రతిభ ఉందని తెలుసుకుని తన బృందంలో ఒకడిగా అవకాశం ఇచ్చాడు. 2019 నుంచి పితాని సిద్ధార్థ్ హీరో సుశాంత్‌తో పాటు అతడి ఇంట్లోనే ఉంటున్నాడు. సుశాంత్‌నే కాదు, అతని కుటుంబ సభ్యులను కూడా ఆకట్టుకున్నాడు. సుశాంత్ కుటుంబీకులు సిద్ధార్థ్‌ను బుద్ధా అని ముద్దుగా పిలుస్టారట.
ఇంత సాన్నిహిత్యం ఉందని చెబుతున్న సిద్ధార్థ్... సుశాంత్, రియాల మధ్య రిలేషన్ వద్దకు వచ్చేసరికి మాటల్లో పొదుపు పాటిస్తున్నాడు. అసలు వాళ్ల గురించే తనకు తెలియదని, అలాంటప్పుడు ఏం జరిగిందో ఎలా చెప్పగలనని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుతం సుశాంత్ కేసును సీరియస్‌గా విచారిస్తున్న బీహార్ పోలీసుల దృష్టి సిద్ధార్థ్‌పై పడిందంటున్నారు.
ఈ క్రమంలో సిద్ధార్థ్ ముంబై పోలీసులకు చేసిన ఈమెయిల్ సుశాంత్ కేసును ఆసక్తికరంగా మార్చింది. రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సుశాంత్ కుటుంబీకులు తనను ఒత్తిడి చేస్తున్నారని సిద్ధార్థ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరిపి సిద్ధార్థ్ నుంచి మరిన్ని వివరాలు రాబడితే ఈ కేసులో ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.