బెంగుళూరు రేవ్ పార్టీ కేసు : నటి హేమకు తాత్కాలిక ఊరట!!

వరుణ్

శుక్రవారం, 14 జూన్ 2024 (09:37 IST)
ఇటీవల బెంగుళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటి హేమ పాల్గొని, డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో ఆమెను కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా బెంగుళూరు జైలులో గడుపుతూ వచ్చిన ఆమెకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. 
 
రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వాడకంపై బెంగళూరు ఎన్‌డీపీఎస్‌ కోర్టులో విచారణ జరిగింది. 'హేమ డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు న్యాయస్థానానికి సమర్పించలేదు' అని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. హేమపై ఆరోపణలు వచ్చిన పది రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారని, ఆమెకు నెగెటివ్‌ వచ్చిందని, ఆమె వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదు అని న్యాయవాది కోర్టుకు నివేదించారు. 
 
అయితే, సీసీబీ (బెంగళూరు నేర నియంత్రణ దళం) న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, 'హేమ మరికొంత మంది టాలీవుడ్‌ సినీ ప్రముఖులను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేశారు, నోటీసులు పంపినా అనారోగ్య కారణాలను సాకుగా చూపి విచారణకు హాజరుకాలేదు, అందువల్లే ఆమెను అరెస్టు చేయాల్సి వచ్చింది' అని కోర్టుకు తెలిపారు. 
 
వాదనలు విన్న న్యాయమూర్తి హేమకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ఆమె ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశాలున్నాయి. కాగా, అరెస్టు తర్వాత తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ హేమ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు నుంచి ఆమె పూర్తిగా బయటపడిన తర్వాతే ఆమె సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు