"కల్కి" చిత్రంలో హీరో ప్రభాస్‍ని జోకర్‌గా చూపించారన్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి కామెంట్లు ఇపుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంలో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అనే విధంగా మారిపోయింది. కేవలం పబ్లిసిటీ కోసమే అర్షద్ వ్యాఖ్యానించారని టాలీవుడ్‌కు చెందిన హీరోలు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు, శర్వానంద్, సుధీర్‌బాబు డైరెక్టుగానే అర్షద్ వార్సీపై విమర్శలు సంధించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా పదాలు కాస్త జాగ్రత్తగా వాడాలంటూ అర్షద్‌కు సలహా ఇచ్చింది.
ఇప్పుడు ఈ విషయంపై 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. చిత్రసీమను వెనక్కి లాకెళ్లొద్దని, టాలీవుడ్ బాలీవుడ్ అనే సరిహద్దులు చెరిగిపోయాయని, దేశం మొత్తం సినిమా ఒక్కటే అని, ఆ దృష్టితోనే చిత్రసీమని చూడాలని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. అర్షద్ విమర్శ కాస్త హుందాగా ఉంటే బాగుండేదని, ఆయన పదాల్ని మరింత మెరుగ్గా ఉపయోగించాల్సిందన్నారు.
'కల్కి-2' కోసం మరింత కష్టపడతానని.. 'కల్కి-2'లో ప్రభాస్ పాత్ర మరింత గొప్పగా, ఉన్నతంగా ఉంటుందని తెలిపారు. అర్షద్ పిల్లలకు బుజ్జి బోమ్మలను పంపుతానని పేర్కొన్నారు. ఇలా ప్రభాద్ - అర్షద్‌ల వివాదాన్ని నాగ్ అశ్విన్ పుల్ స్టాప్ పెట్టడానికి తన పోస్ట్ ద్వారా ప్రయత్నించారు.