చిత్ర సీమలో ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు : నందమూరి బాలకృష్ణ

డీవీ

శనివారం, 8 జూన్ 2024 (12:29 IST)
Ramoji rao
రామోజీరావు గారికి నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, నిర్మాత‌ సి.అశ్వ‌నీద‌త్, యావత్ సినిమా పరిశ్రమ  అశ్రు నివాళి అర్పించింది. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తమ సంతాపాన్ని తెలిపింది. 
 
తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు గా వెలుగొందారు రామోజీ రావు. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని  సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి గా నిలిచారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్ర సీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో గా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోంది. మా తండ్రిగారు నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
 
 తండ్రిసమానులు. రామకృష్ణ 
 ఒక రైతు కుటుంబములో జన్మించి వ్యవసాయంలో వారి తండ్రుకి చేదోడుగా ఉంటూ కష్టపడి చదువుకున్నారు రామోజీ రావు గారు  అన్ని రంగాల్లో వారు వారి  సేవలందించారు ఇటు ప్రెస్ మీడియా/జర్నలిజం లీడరే కాకుండా….మార్గదర్శి చిట్స్ / ఫైనాన్స్ చైర్మన్ గాను… సినీ నిర్మాతగా, సినీ స్టూడియో అధినేతగా వివిధ రంగాల్లోనూ చాలామందికి ఉద్యోగాలు కల్పించి అందరిని ఆదుకున్నారు రామోజీ రావు గారు. వారెక్కడున్న వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… మా కుటుంభం తరఫున వారి కుటుంభానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము 
 
తెలుగు జాతికి తీర‌ని లోటు : నిర్మాత‌ సి.అశ్వ‌నీద‌త్ 
ఏ రంగంలో అయినా, ఎలాంటి నేప‌థ్యం లేక‌పోయినా క‌ష్ట‌ప‌డితే చాలు... విజ‌యం ద‌క్కుతుంది అనే స్ఫూర్తిని నాలాంటి ఎంతోమందికి పంచిపెట్టిన రామోజీరావు గారి జ‌న్మ ధ‌న్యం. తెలుగు కీర్తిని, స్ఫూర్తిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారి మ‌ర‌ణం ఈ దేశానికి, ముఖ్యంగా తెలుగు జాతికి తీర‌ని లోటు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు