విజయ్ దేవరకొండ అనగానే అర్జున్ రెడ్డి చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో మాస్ క్యారెక్టర్లో కనిపించిన విజయ్ ఇప్పుడు టోటల్‌గా రివర్స్ క్యారెక్టరుతో గీత గోవిందం చిత్రంతో ఈ ఆగస్టు 15న ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కథ ఎలా వుందో ఇప్పుడు చూద్దాం. చిన్నప్పటి నుంచి చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు వింటూ పెరిగిన విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) లెక్చరరుగా పనిచేస్తుంటాడు. తను సాంప్రదాయంగా పెరిగిన అబ్బాయి కనుక తనకు కూడా అలాంటి లక్షణాలున్న అమ్మాయి కావాలనీ, అలాంటివారి కోసం వెతుకుతుంటాడు.
ఈ క్రమంలో అతడు కోరుకున్న లక్షణాలు కలిగిన అమ్మాయి తారసపడుతుంది. దాంతో ఆమె వెనుకాల పడతాడు. ఆరు నెలల తర్వాత తెలుస్తుంది... ఆమెకు అప్పటికే పెళ్లయిపోయిందని. ఇక మళ్లీ వేట మొదలుపెడతాడు. ఒకరోజు గీత(రష్మిక మందన్న)ను దేవాలయంలో చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఇక అక్కడ్నుంచి ఆమె కోసం, ఆమెను పెళ్లి చేసుకోవాలన్న తపనతో తిరుగుతుంటాడు. కానీ తన మనసులో మాట చెప్పేందుకు భయపడిపోతుంటాడు.
ఇక సినిమా విషయానికి వస్తే... దర్శకుడు పరశురామ్ తనదైన కామెడీ, ఎమోషనల్ టేకింగ్‌తో చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. చెప్పాలంటే అర్జున్ రెడ్డి ఇమేజిలో ఇరుక్కుపోయిన విజయ్ దేవరకొండను దాన్నుంచి బయటపడేసి మంచి అబ్బాయిగా చూపించాడు. ఈ చిత్రం ఆసాంతం గోవింద్ పాత్రలో విజయ్ దేవరకొండ చక్కగా అతికినట్లు సరిపోయాడు. చాలా రెస్పెక్ట్ వున్న యువకుడిలా నటిస్తూ జీవించేశాడు.