సహచర న్యాయమూర్తులకు విందు ఇచ్చిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్

ఆదివారం, 10 నవంబరు 2019 (12:57 IST)
ఎన్నో దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శనివారం తెరదించారు. ఈయన సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసులో తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై అన్ని వర్గాల వారు సంతృప్తి వ్యక్తం చేస్తూ, తీర్పును స్వాగతిస్తున్నారు. 
 
ఇలా అందరికీ ఆమోద యోగ్యమైన కీలక అయోధ్య తీర్పు ఇవ్వడం, మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనుండటం వంటి సుమధుర ఘట్టాల నేపధ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ తన సహచర న్యాయమూర్తులకు విందు ఇచ్చారు. 
 
అయోధ్య తీర్పును వెలువరించిన తర్వాత సహచరులకు విందు ఇవ్వనున్నట్లు ముందే ప్రకటించిన చీఫ్‌ జస్టిస్‌ ఢిల్లీలోని తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ హాజరయ్యారు. 
 
ముఖ్యంగా, అయోధ్య తీర్పును ప్రకటించిన తర్వాత సహచర న్యాయమూర్తులను గొగోయ్‌ స్వయంగా తోడ్కోని హోటల్‌కు వెళ్లడం విశేషం. సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న గొగోయ్‌ పదవీ కాలం ఈనెల 17వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈయనకు ఈ నెల 15వ తేదీన చివరి పనిదిన కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు