ఉద్ధవ్‌ ఠాక్రేకు కరోనా కష్టాలు... సీఎం పదవికి రాజీనామా తప్పదా?

గురువారం, 23 ఏప్రియల్ 2020 (19:26 IST)
కరోనా వైరస్ మహారాష్ట్రను పట్టిపీడిస్తోంది. దేశంలో అత్యధిక కరోనా కేసులతో పాటు మరణాలు సంభవించిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దీంతో మహారాష్ట్ర వాసులు కరోనా భయంతో వణికిపోతున్నారు. ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. అయితే, ఈ కరోనా కష్టాలు ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు చుట్టుముట్టాయి. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు నెలకొనేలా కనిపిస్తున్నాయి. 
 
నిజానికి, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన ఇటు అసెంబ్లీ లేదా అటు శాసనమండలిలో సభ్యుడు కాదు. సాధారణంగా ముఖ్యమంత్రిగా, మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆర్నెల్ల సమయంలో ఏదేని ఒక సభ నుంచి ఎన్నిక కావాల్సివుంది. కానీ, ఇపుడు ఉద్ధవ్ ఠాక్రే విషయంలో అలా జరిగే సూచనలు కనిపించడంలేదు. 
 
పైగా, ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోటా నుంచి శాసనసభకు నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల మహారాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శాసనమండలి ఎన్నికలు వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో మరో నెల ఉద్ధవ్‌ ఏ సభకూ ఎన్నిక కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 
 
గవర్నర్‌ కోటాలో ఉద్ధవ్‌ మండలికి నామినేట్‌ చేయాలనే ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. అయితే ఆ కోటాలో ప్రస్తుతం ఉన్న ఇద్దరి సభ్యుల పదవీ కాలం మరో రెండునెలల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేవలం రెండు నెలల పదవీకాలం మాత్రమే ఉన్న స్థానంలో ఆయన్ని గవర్నర్‌ నామినేట్‌ చేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు గవర్నర్‌ కోటాలో ఉద్ధవ్‌ను ఎంపిక చేయడం సరైనది కాదని ప్రతిపక్ష బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
 
కాగా, గత ఏడాది నవంబరు 28వ తేదీన ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఏ సభల్లోనూ (అసెంబ్లీ, మండలి) ఆయనకు ప్రాతినిథ్యం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఉభయ సభల్లో ఏదోఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. రానున్న మే 28 నాటికి ఠాక్రే సీఎంగా ఎన్నికై ఆరు నెలల సమయం ముగియనుంది. ఈలోపు ఆయన ఏ ఒక్క సభ నుంచి ఎన్నికయ్యే సూచనలు కనిపించడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు