స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం : సీఎం యోగి ఆదిత్యనాథ్

గురువారం, 26 ఏప్రియల్ 2018 (14:52 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఖుషీ నగర్‌లో పాఠశాల వ్యాన్‌ రైల్వే క్రాసింగ్‌ వద్ద పట్టాలు దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుని 13 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ వ్యాన్‌ డ్రైవర్‌ ఫోన్‌ మాట్లాడుతున్నాడని, అతడి చెవిలో ఇయర్‌ఫోన్స్‌ కూడా ఉన్నాయని, అందువల్లే క్రాసింగ్‌ వద్ద సెక్యూరిటీ గార్డు సంకేతాలిస్తున్నా డ్రైవర్‌కి వినిపించలేదని వివరించారు. ఈ కారణంగానే ఘోర ప్రమాదం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
డ్రైవర్‌ పాఠశాల నుంచే ఫోన్‌ మాట్లాడుతూ వ్యాన్‌ నడుపుకుంటూ వచ్చాడని, అయినప్పటికీ సదరు పాఠశాల యాజమాన్యం అతడిని ఎందుకు ప్రశ్నించలేదన్న విషయంపై తాము విచారణ చేపడతామన్నారు. నిబంధనలు అతిక్రమించినట్లు రుజువైతే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. 
 
విద్యార్థులతో వెళుతున్న వాహనాన్ని రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది అమాయకపు ముద్దులొలికే చిన్నారులు ప్రాణాలు వదిలారు. వీరందరి వయసూ 10 సంవత్సరాల్లోపే. అందరూ ఖుషీనగర్‌లోని డివైన్ పబ్లిక్ స్కూలు చిన్నారులే. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు