దేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఛైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జి. సతీష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సతీశ్‌రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఉన్నారు. ఆయన రెండేండ్ల పాటు డీఆర్డీవో ఛైర్మన్‌గా కొనసాగుతారు.
నెల్లూరు జిల్లాకు చెందిన సతీశ్ రెడ్డి హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. ఆయన 1985లో డీఆర్‌డీఓలో చేరారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన సతీశ్‌రెడ్డి క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష పరిజ్ఞానం, పరిశ్రమల అభివృద్ధికి చేయూతనందించారు.
లండన్‌లోని రాయల్ ఏరోనాటికల్ సొసైటీలో ఫెలో ఆఫ్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్‌గా ఆయన అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. రష్యాలోని ఎకాడమీ ఆఫ్ నావిగేషన్, మోషన్ కంట్రోల్ సంస్థలో శాశ్వతకాల విదేశీ సభ్యునిగా మరో అరుదైన గౌరవం పొందారు. భారత్‌లోని అనేక ఇంజినీరింగ్ సంస్థలలో సైతం గౌరవసభ్యునిగా ఉన్న సతీశ్‌రెడ్డి ప్రతిష్టాత్మక హోమీ బాబా స్మారక అవార్డును సొంతం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సంస్థ ఛైర్మన్‌గా ఉన్ ఎస్. క్రిస్టఫర్ పదవీ విరమణతో గత మూడు నెలలుగా ఈ పదవి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డిని ఆ బాధ్యతలను అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం (డీఆర్డీ) కార్యదర్శిగా కూడా ఉంటారని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆప్రకటనలో తెలిపింది.