దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్- 19 వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది. మొత్తం 116 జిల్లాల్లోని 259 కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోనూ డ్రై రన్ ప్రారంభమైంది. నగరంలోని 3 ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. దిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో వ్యాక్సీన్ డ్రై రన్ కార్యక్రమాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్థన్ పరిశీలించారు.
వ్యాక్సిన్‌ను నిల్వ చేసిన కేంద్రాల నుంచి పంపిణీ కేంద్రాలకు తరలించేందుకు ఎంత సమయం పడుతుంది? ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది కూడా తెలుస్తుంది. ఈ ప్రక్రియలో ఒక్కో టీకా కేంద్రంలో 25 మంది ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ -19 డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. దేశంలో ఇది రెండో దశ డ్రై రన్. మొదటి దశలో 2020 డిసెంబర్ 28న ఆంధ్రప్రదేశ్, అసోం, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించారు.
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కోసం 96 వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 2,360 మందికి నేషనల్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్‌లో శిక్షణ ఇవ్వగా, 57,000 మందికి పైగా సిబ్బంది 719 జిల్లాల్లో జిల్లా స్థాయి శిక్షణ పొందారని చెప్పింది.
వ్యాక్సీన్‌ను త్వరితగతిన పంపిణీ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు, లోపాలు ఉన్నా చెప్పాలని కేంద్ర మంత్రి హర్ష్ వర్ధన్ అన్ని రాష్ట్రాల అధికారులను కోరారు. ఏవైనా సమస్యలు ఉన్నట్టు ఈ డ్రై రన్‌లో గుర్తిస్తే, టీకా అందుబాటులోకి వచ్చేలోగా వాటిని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.