పూణెలో భారత్ గ్రాండ్ విక్టరీ... న్యూజిలాండ్‌కు షాక్

గురువారం, 26 అక్టోబరు 2017 (06:17 IST)
మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పూణె వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. కివీస్ జట్టు నిర్ధేశించిన 231 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. కోహ్లీ సేన 46 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. ఫలితంగా రెండో వన్డేలో గెలుపును సొంతం చేసుకుని వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. 20 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయిన కివీస్… 58 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ లాథమ్ (38), నికోలస్ (42) నిలకడగా ఆడటంతో కాసేపు వికెట్లను నిలబెట్టుకుంది. అయితే భువి ఈ జోడీని విడగొట్టాడు. 
 
ఓపెనర్లు గుప్తిల్‌, మున్రోను పెవిలియన్‌కు పంపిన భువనేశ్వర్‌ క్రీజులో పాతుకుపోయిన నికోల్స్‌ను కూడా ఔట్ చేశాడు. 38వ ఓవర్లో ఐదో బంతికి నికోల్స్‌ బౌల్డయ్యాడు. 40 ఓవర్లు ముగిసేనాటికి 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసిన కివీస్‌ను చాహల్ దెబ్బకొట్టాడు. 44వ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. గ్రాండ్ హోమ్మి(40), మిల్నే(0)ను ఔట్ చేశాడు. 
 
దీంతో కివీస్ 8 వికెట్లు కోల్పోయింది. అయితే కొద్దిలో చాహల్ హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. 49వ ఓవర్ లో బూమ్రా బౌలింగ్‌లో స్టన్నర్(29) తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టీమ్ సోథీ(25 నాటౌట్), ట్రెంట్ బోల్ట్(2) నిలకడగా ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 230 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు తీయగా.. చాహల్, బూమ్రా చెరో రెండు వికెట్లు, పాండ్యా, పటేల్‌లు తలా వికెట్ చొప్పున తీశారు.
 
అనంతరం 231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన... అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ రెండోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ(29) జోరుగా ఆడినా డీ గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో టీమ్ స్కోర్ 79 రన్స్ దగ్గర అవుటయ్యాడు. ఆ తర్వాత వికెట్ పడకుండా దినేశ్ కార్తిక్, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంచేశారు. 
 
అయితే ఈ జోడీని మిల్నే విడగొట్టాడు. జట్టు స్కోర్ 145 దగ్గర ధావన్(68) ఔట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన హార్దిక్ పాండ్యా(30) మెరుపులు మెరిపించాడు. కానీ, గెలుపుకు 26 పరుగుల దూరంలో ఉండగా.. సాట్నర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ(18), దినేశ్(64)లు టీమ్‌కు విజయాన్ని అందించారు. కివీస్ బౌలర్లలో సౌథీ, మిల్నే, గ్రాండ్ హోమ్, సాట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు