హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో దారుణం జరిగింది. అక్కా చెల్లెళ్ళపై నలుగురు వలస కార్మికులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాధితురాళ్లే స్వయంగా బలవన్మరణానికి పాల్పడేలా ఒత్తిడి చేశారు. పురుగుల మందు తాగి చనిపోయేలా ఒత్తిడి చేశారు. ఆ తర్వాత పాముకాటుతో చనిపోయారని చెప్పాలని, లేదంటే హత్యచేస్తామని వాళ్ల తల్లిని కూడా బెదిరించారు. ఆఖరికి పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో సోనిపట్‌లో ఉంటున్నది. భర్త లేకపోవడంతో కూలినాలి చేసుకుంటూ తన 14, 16 ఏండ్ల కూతుళ్లను పోషించుకుంటున్నది. వారుంటున్న ఇంటిపక్కనే నలుగురు కుర్రాళ్లు ఉంటున్నారు.
వారు వలస కార్మికులు. ఆ నలుగురు యువకుల కన్ను ఆ ఇద్దరు యువతులపై పడింది. ఈనెల 5, 6 తేదీల్లో ఇద్దరు అమ్మాయిలపై లైంగికదాడి చేశారు. అనంతరం పురుగుల మందు తాగి చనిపోవాలని వారిపై ఒత్తిడిచేశారు. పాము కాటేసిందని చెప్పాలని వారి తల్లికి చెప్పారు. లేదంటే ఆమెను చంపుతామని బెదిరించారు.
కానీ, పోస్ట్ మార్టం రిపోర్టులో వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తేలింది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. తల్లిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.