ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి వచ్చే 2024లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై అపుడే దృష్టిసారించారు. ఇందుకోసం మిషన్ 2024 అనే పేరుతో ఆయన నడుం బిగించనున్నారు. ఈ మిషన్‌లో భాగంగా ప్రస్తుత మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ పార్టీ.. ఇప్పటికే రెండున్నారేళ్ల అధికారం పూర్తి చేసుకున్నారు జగన్. ఇక, తిరిగి 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటంపైన ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నారు.
బయట ప్రతిపక్షాలు, ఇతరులు ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వంపైన వ్యతిరేకత లేదని ప్రజల్లో ఉన్న సానుకూలత మరింత అనుకూలంగా మలచుకొనే వ్యూహాలు అమలు చేయాలని జగన్ నిర్దేశించారు. అందుకోసం ప్రతీ మంత్రి.. ఎమ్మెల్యే ప్రతీ ఇంటికి పార్టీ ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ గడపగడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించాలని సూచించినట్లుగా తెలుస్తోంది.
దీంతో పాటుగా అక్టోబర్ రెండో తేదీ నుంచి తాను ప్రభుత్వ పథకాల సమీక్షల్లో భాగంగా రచ్చబండలో పాల్గొంటానని గతంలోనే సీఎం వెల్లడించారు. దీంతో వైసీపీ ముందస్తుగానే 2024 ఎన్నికల కోసం రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.