కోవిడ్ వదిలేసింది కదా అనుకోవద్దండీ... కరోనా మహాజిడ్డు, అలా కూడా ఇబ్బందిపెడుతుంది

శనివారం, 14 నవంబరు 2020 (19:29 IST)
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గురువారం  కొత్తగా 47,905 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా ఉంటోంది. మరణాల సంఖ్యా తగ్గుతోంది. అయితే చలికాలంలో వైరస్ మరింత తీవ్రప్రభావం చూపొచ్చన్న ప్రచారం నేపథ్యంలో కోవిడ్ సోకి కోలుకున్నవారు నిర్లక్ష్యంగా ఉండవద్దని.. వైరస్ సోకిన సమయం కంటే ఆ తర్వాత రోజులే ముఖ్యమైనవని వైద్యులు సూచిస్తున్నారు.
 
రెండోసారి వైరస్ సోకిన వ్యక్తిలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్టు ఇటీవల వైద్యులు ధ్రువీకరించారు. జ్వరం, తలనొప్పి, దగ్గు, ఒళ్ళు నొప్పులు, డయేరియా వంటి లక్షణాలు ఇబ్బంది పెట్టినట్టు వైద్యులు చెబుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో కోవిడ్‌ నుంచి కోలుకోగానే ఇక తాము వైరస్ ను జయించామని.. తమ ఆరోగ్యానికి ఢోకా లేదనే అతివిశ్వాసంతో వ్యవహరించవద్దని, అలా అని మరీ భయపడి కృంగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత నిర్లక్ష్యంగా ఉంటే గుండె, మెదడు, కిడ్నీ వంటి కీలకమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో కోవిడ్ రీఇన్ఫెక్షన్‌ కేసులు (COVID Reinfection cases) కూడా అనేక చోట్ల  వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్నంత మాత్రాన దానినుంచి దీర్ఘకాలిక రక్షణ పొందగలిగేంత రోగ నిరోధక శక్తిని పొందినట్లు కాదు. కోవిడ్ యాంటీబాడీలు కొందరిలో మూడు నెలలు, మరికొందరిలో ఆరు నెలలు క్రియాశీలంగా ఉంటాయని అధ్యయనాల్లో వెలుగు చూసినట్టు వైద్యులు గుర్తు చేస్తున్నారు.
 
అయితే మరి కొంతమందిలో మాత్రం యాంటీబాడీలు తగినంతగా అభివృద్ధి చెందకపోతే మరోసారి ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇన్ఫెక్షన్‌ రాకముందు ఎలా అప్రమత్తంగా ఉన్నారో.. కోలుకున్న తర్వాత కూడా అంతే అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉంటుంది. ముఖ్యంగా గుండె, కిడ్నీ, మధుమేహం, కాలేయం, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్లు అదనపు అప్రమత్తతతో వ్యవహరించాలి.
 
ఈ క్రింది జాగ్రత్తలు అవసరం:
సాధారణంగా కరోనా వైరస్‌ ఇంక్యుబేషన్‌ టైమ్ 14 రోజులని వైద్యులు చెప్తున్నారు. ఆ సమయంలో తప్పకుండా వైద్యులు సూచించిన మందులు వాడాలి. కోలుకున్న తర్వాత కూడా వైద్యులు సూచించే మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఒకవేళ మధ్యలో మందులు ఆపేస్తే వైరస్‌ మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది.
 
ఒకవేళ మెదడుపై వైరస్‌ ప్రభావం పడితే 10 రోజుల వరకూ ఎలాంటి మందులు వాడినా జ్వరం తగ్గదు. ఈ పరిస్థితిలో వెంటనే సీఎస్ఎఫ్‌ అనాలసిస్‌ చేయించుకుంటే విషయం బయటపడుతుంది. ఈ తరహా లక్షణాలున్న వారు వెంటనే ఆస్పత్రిలో చేరడం మంచిది. రక్తాన్ని చిక్కబడేలా చేసే గుణం కోవిడ్ వైర్‌సకు ఉండడంతో రక్తం సరఫరాలో ఆటంకాలు ఏర్పడి ఆకస్మాత్తుగా గుండె ఆగిపోవడం, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటివి చోటు చేసుకోవచ్చు.
 
ఇప్పటికే ఇతర జబ్బులు ఉన్నవారికి.. కోవిడ్ వైరస్‌ వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మరోసారి వైరస్‌ దాడిచేసే ప్రమాదముంది. ఇతర జబ్బులున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో రీఇన్ఫెక్షన్‌ గండం పొంచి ఉంటుంది.
 
స్టెరాయిడ్స్ వాడిన వారిలో సుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండవు. కాబట్టి తరచూ చెకప్ చేయించుకుంటూ ఉండాలి.
 
ఊపిరితిత్తులు ఎక్కువ ప్రభావానికి గురై ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఫోన్లలో మాట్లాడకూడదు. ఆయాసం ఎక్కువగా ఉంటే న్యుమోథొరాక్స్ (Pneumothorax) అనే సమస్య తలెత్తవచ్చు. దీంతో ఛాతిలో ఐసిడి అనే పైపు వేయవలసి రావచ్చు.
 
దగ్గు ఎక్కువగా వస్తున్నట్టయితే సెకెండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మరికొంత కాలం యాంటీబయోటిక్స్ వాడవలసి వస్తుంది.
 
కిడ్నీ మరియు ఇతర సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
 
3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వైద్య సహాయం తీసుకుంటూ ఉండాలి.
 
-డాక్టర్ అర్జా శ్రీకాంత్, స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు