వేసవిలో పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారా? హాయిగా వుందామని చల్లని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్తున్నారా? అయితే ట్రిప్పుకొచ్చి.. ఆహారంపై దృష్టి పెట్టడం మానేశారంటే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆహారంపై పెద్దగా దృష్టి పెట్టరు. ఏదో దొరికిన ఆహారాన్ని తీసుకోవడం.. అలాగే రుచిగా వుండే ఆహార పదార్థాలను లాగించేయడం చేస్తుంటారు.
అంతేగాకుండా.. దారిలో కనిపించే పదార్థాలన్నీ రుచిచేస్తుంటారు. కానీ పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మసాలా లాంటి వేడిచేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శరీరానికి చలవ చేసే ఆహారాన్నే తీసుకోవాలని.. ముఖ్యంగా వేసవిలో శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాల్లే డైట్లో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.
అలాగే పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. నిమ్మరసం బాటిల్ బ్యాగులో పెట్టుకోవాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ వుండాలి. చల్లగా ఉంటుందని ఎక్కువగా పానీయాల్లో ఐస్ ముక్కలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని గమనించండి.
అలాగే మసాలా దినుసులు, కారపు ఆహార పదార్థాలను పక్కనబెట్టాలి. వీలైనంత వరకు మితమైన కారం, ఉప్పు వుండే ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకుంటే వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసిన వారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.