దేశవ్యాప్తంగా ఉన్న శివక్షేత్రాలు శివనామ స్మరణలో మార్మోగిపోతున్నాయి. ఫలితంగా అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. సోమవారం తెల్లవారుజామునుంచే భక్తులు శివాలయాలకు క్యూకట్టి, మహాశివుడి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరి నిల్చున్నారు.
ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నదులలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా కృష్ణానది, గోదావరి నదులలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు.
అదేవిధంగా మహాపుణ్యక్షేత్రంగా ఉన్న శ్రీశైలంలో వైభవోపేతంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. రాజమండ్రిలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. గోదావరి పుష్కరాల రేవులో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి స్నానాలు చేస్తున్నారు.