బెంగాల్ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై ఆ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐదు నిమిషాల్లోనే పోలింగ్ శాతం సగానికి సగం ఎలా తగ్గిందని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఓ బ్రయన్ లేఖ రాశారు. ఈరోజు బెంగాల్ లో తొలి దశ ఓటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.
కాగా, పోలింగ్ బూత్ లలోకి బయటి ఏజెంట్లను అనుమతించడంపై బెంగాల్ సీఈవోకు అభ్యంతరాలు తెలియజేశామని తృణమూల్ నేత సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. ఇంతకుముందు స్థానిక బూత్ లలో ఓటు హక్కు ఉన్నవారినే అక్కడ ఏజెంట్లుగా నియమించేలా నిబంధన ఉండేదని, కానీ, ఆ నిబంధనలను బీజేపీ మార్చేసిందని అన్నారు. ఆ నిబంధనను మార్చాల్సిందిగా సీఈవోను కోరామన్నారు. కాగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 36 శాతం పోలింగ్ నమోదైంది.