జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిపై మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్ధు పాకిస్థాన్‌ను సమర్థించడంపై.. నెటిజన్లు మండిపడుతున్నారు ఉగ్రదాడికి పాకిస్థాన్‌కు సంబంధం లేనట్లు మాట్లాడటంతో పాటు.. పాకిస్థాన్‌తో భారత్ చర్చలు జరిపితేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయంటూ సిద్ధు చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
సిద్ధును కాంగ్రెస్ నుంచి గెంటివేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్‌లో వుంటూ పాకిస్థాన్‌కు వంతపాడుతున్న సిద్ధుకు వ్యతిరేకంగా గళమెత్తాల్సిందిగా తోటి నెటిజన్లకు పిలుపునిచ్చారు. ఇటీవల పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి హాజరైన సిద్ధు. అక్కడే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడంపైనా తీవ్ర స్థాయిలో విమర్శలకు గురైన సంగతి తెలిసిందే.
తాజాగా ఉగ్రదాడి జరిగితే ఒక దేశం మొత్తంపైన నింద వేస్తారా అని ప్రశ్నించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో సోనీ టీవీకి కూడా ఇదే తరహా డిమాండ్ పెడుతున్నారు. సోని టీవీలో ప్రసారమయ్యే ''ది కపిల్ శర్మ'' షోను నిషేదించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆ షో నుంచి సిద్ధూని తీసేయాలని పట్టుబడుతున్నారు. లేకుంటే తాము సోనీ టీవీని బహిష్కరిస్తామని పలువురు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.