ఎవరు ముందు కనిపిస్తే వారిని కాల్చేయండి.. అన్మోల్ బిష్ణోయ్ ఆదేశం.. నిందితుడి వాంగ్మూలం

ఠాగూర్

మంగళవారం, 12 నవంబరు 2024 (13:22 IST)
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్ధిఖీని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు తుపాకీతో ఇటీవల కాల్చి చంపేశారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు శివకుమార్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక విషయాలు వెల్లడించారు. 
 
కుదిరితే బాబా సిద్ధిఖీని, లేకుంటే ఆయన కుమారుడు జిషాన్‌ సిద్ధిఖీని హతమర్చాలని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ తనను ఆదేశించినట్లు  నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎవర్ని ముందు చూస్తే వారిని కాల్చేయండి అని అన్మోల్ బిష్ణోయ్ తనను ఆదేశించారని నిందితుడు శివకుమార్ తెలిపారు. దేవుడు, సమాజం కోసమే తాను ఇదంతా చేస్తున్నట్లు అన్మోల్‌ తెలిపాడని నిందితుడు వెల్లడించాడు. 
 
హత్యానంతరం నిందితుడు చొక్కా మార్చుకొని ఆటోలో ఠానే లోకల్‌ రైలు ఎక్కి పుణే పారిపోయాడు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ, లక్నో, బహ్రాయిచ్‌ తదితర ప్రాంతాల్లో నక్కారు. ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లిపోవాలనుకున్నాడు. అంతకుముందు ఉజ్జయిని, వైష్ణోదేవీ ఆలయాలను సందర్శించాలని ప్లాన్‌ చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. 
 
అక్టోబరు 12వ తేదీన బాబా సిద్ధిఖీ ముంబైలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా.. కొందరు దుండగులు ఆయనపై కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు తామే కారణమని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ కేసులో దాదాపు 20 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు షూటర్లలో శివకుమార్‌ ఒకడు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌ ఎస్టీఎఫ్‌తో కలిసి ముంబై పోలీసులు ఆదివారం శివకుమార్‌తో పాటు అతడికి ఆశ్రయం కల్పించినట్లు ఆరోపణలున్న మరో నలుగురిని అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు