ఈ నెల 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వైద్యుడి పేరు జహీద్ అబ్దుల్ మజీద్. జమ్మూ-కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా ఆయన స్వస్థలం. కొవిడ్-19 రోగి ఒకరిని అంబులెన్స్‌లో ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లోని ఐసీయూకు తరలించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఆ రోగి ఇబ్బంది పడుతున్నట్లు మజీద్ గుర్తించారు.
శ్వాస కోసం గొంతులోకి వేసిన గొట్టం పొరపాటున ఊడిపోయినట్లు ఆయన గమనించారు. దాన్ని తిరిగి యథాస్థానంలో ప్రవేశపెట్టేందుకు ఈ వైద్యుడు ప్రయత్నించారు. అయితే అంబులెన్స్ లోపల వెలుగు సరిగా లేదు. దీనికితోడు తాను వ్యక్తిగత రక్షణ కవచాలు, కళ్లద్దాలను ధరించి ఉండటంతో సరిగా కనిపించలేదని మజీద్ చెప్పారు.
జాప్యం చేస్తే రోగి చనిపోయే ప్రమాదం ఉన్నందువల్ల అతడిని రక్షించడానికి కళ్లద్దాలు, ముఖ కవచాన్ని తొలగించి, అతడికి ట్యూబ్‌ను అమర్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో రోగి నుంచి భారీగా వైరస్ అంటుకునే ప్రమాదం ఉన్నప్పటికీ ఆయన ఏ మాత్రం సంకోచించలేదని ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాజ్‌కుమార్ తెలిపారు.
దేశం మొత్తం కొవిడ్-19తో పోరాడుతోందని, దీనిపై అందరూ ఐక్యంగా సాగాలని కోరారు. రోగులు, సాటి ఉద్యోగులు, వైద్య సిబ్బంది పట్ల సానుభూతి చూపాలని విజ్ఞప్తి చేశారు.