అరుణాచల్‌ ప్రదేశ్ మా అంతర్భాగం: సీఎం ఖండూ

ఆదివారం, 25 అక్టోబరు 2009 (13:14 IST)
భారత్-చైనాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్న అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌లో అంతర్భాగమని ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దూర్జీ ఖండూ స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ రాష్ట్ర పర్యటనకు రానున్న టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు సాదర స్వాగతం పలుకుతామని ఆయన తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖండూ ఆదివారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాగమని స్పష్టం చేశారు. ఈ అంశంలో చైనా పాలకులు చేస్తున్న వాదనలో ఏమాత్రం అర్థం లేదన్నారు. మన దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా నివశించే ప్రజలు పలు భాషలను మాట్లాడుతుంటారన్నారు. అయితే, దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో హిందీ భాషతో అనుబంధం ఉన్న రాష్ట్రం తమదేనన్నారు.

అలాగే, వచ్చే నెల ఎనిమిదో తేదీన రాష్ట్ర పర్యటనకు రానున్న టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాను ఆహ్వానిస్తామన్నారు. ఈయన తమ రాష్ట్ర పర్యటనకు రావాలని నిర్ణయించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరుల బలోపేతానికి తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తామని ఖండూ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి