సరిహద్దుల్లో భారత్-చైనాలు శాంతిని పరిరక్షస్తాయి: పీఎం

ఆదివారం, 25 అక్టోబరు 2009 (17:59 IST)
సరిహద్దుల్లో శాంతిని పరిరక్షించేందుకు భారత్-చైనాలు అంగీకరించాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. తన రెండు రోజుల థాయ్‌లాండ్ పర్యటనను ముగించుకుని ఆయన ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శనివారం చైనా ప్రధాని వెన్ జియాబావోతో జరిగిన ముఖాముఖి చర్చల్లో ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలపై విస్పష్టంగా, నిక్కచ్చిగా మాట్లాడినట్టు చెప్పారు.

సరిహద్దు సమస్యతో పాటు.. ద్వైపాక్షిక అంశాలపై కూడా చైనా ప్రధానితో చర్చించినట్టు తెలిపారు. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు అంగీకరించాయని తెలిపారు. ప్రధానంగా సరిహద్దుల్లో శాంతిని కాపాడాలని నిర్ణయించినట్టు తెలిపారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న సరిహద్దు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇకపోతే.. బౌద్ధమత గురువు దలైలామా తమ గౌరవ అతిథి అని చెప్పారు. అయితే, వచ్చే నెలలో అరుణాచల్ ప్రదేశ్‌లో దలైలామా చేపట్టనున్న ప్రదర్శనపై మాత్రం డాక్టర్ మన్మోహన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

వెబ్దునియా పై చదవండి