ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తిరిగి స్వదేశానికి రానున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చేపడుతోంది. దీంతో ఆయన డిసెంబరు నెలలో స్వదేశానికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా, హుస్సేన్ కుంచె నుంచి జాలువారిన పలు చిత్రలేఖనాలు వివాదాలకు దారితీశాయి. దీంతో ఆయనపై పలు కేసులు నమోదైవున్నాయి.
దీంతో ఆయన గత మూడేళ్ళుగా దుబాయ్‌లో నివశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆయన సన్నిహితులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆయనపై ఉన్న పలు కేసులకు సంబందించి కేంద్ర హోం శాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వెలువడుతుందని, ఆ తర్వాత ఆయన స్వదేశానికి వస్తారని హుస్సేన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
హుస్సేన్ గీసిన హిందూ దేవతల చిత్రాలపై పలు హిందూ మతపెద్దలు, సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన 2006 సంవత్సరం నుంచి దుబాయ్‌లో నివశిస్తున్నారు. తిరిగి ఆయన స్వదేశానికి రావాలని కోరుకుంటున్నారు.