దేశ వాణిజ్య రాజధాని ముంబైపై మారణహోమానికి పాల్పడిన ముష్కరులపై పాకిస్థాన్ తీసుకున్న చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ దాడులకు కుట్రపన్నిన, సుత్రధారులుగా భావిస్తున్న వారు పాక్ వీధుల్లో యధేచ్చగా తిరిగేలా పాక్ చర్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పర్యటన ముగించుకుని రాజధానికి బయలుదేరే ముందు ఆయన శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ముంబై ముష్కరులపై చేపట్టిన చర్యల పట్ల మేం సంతృప్తికరంగా లేం. ఇప్పటికైనా 26/11 దాడులకు బాధ్యులైన వారిని పాక్ పాలకులు చట్టం ముందు నిలబెట్టాలని కోరారు.
గత యేడాది జరిగిన ఈ మారణహోమానికి తమ దేశ గడ్డపైనే కుట్ర జరిగినట్టు పాకిస్థాన్ అంగీకరించింది. ఈ దాడుల్లో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. ఇదిలావుండగా, బుధవారం పొరుగు దేశంలో స్నేహాస్తం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన మన్మోహన్ సింగ్ రెండో రోజున ముంబై దాడుల ప్రస్తావన తెచ్చి పాక్ తీరును ఎండగట్టడం గమనార్హం.
ప్రతిపాదించిన చర్చలు సజావుగా ముందుకు సాగాలంటే పాక్ గడ్డపై ఉన్న తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలన్న షరతు విధించారా అని ప్రశ్నించగా, అలాంటిదేమీ కాదన్నారు. అయితే, ముందుకు వెళ్లాలంటే ఇది ప్రయోగాత్మక మార్గమన్నారు.
అలాగే, బలూచిస్థాన్ హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న తాలిబన్ తీవ్రవాదులకు భారత్ ఎలాంటి సాయం చేయలేదని ప్రధాని తేల్చి చెప్పారు. పాక్ అంతర్గత మంత్రి రెహ్మాన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా మన్మోహన్ స్పష్టం చేశారు.