ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టుల పందారానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, పవిత్ర పుణ్యస్థలంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి కొత్త ఛైర్మన్‌గా సుధాకర్ యాదవ్‌ను నియమించింది. అలాగే, ఆర్టీసీ ఛైర్మన్‌గా ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఎంపిక చేసింది. వీటితో పాటు.. మరో 15 సంస్థలకు ఛైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు.
సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ, అన్ని ప్రాంతాలు, వర్గాల సమీకరణాలను పాటిస్తూ పదవులు భర్తీ చేశారు. రాజకీయ కోణాలను కూడా పరిగణనలోకి తీసుకొన్నారు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ జాబితా విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధ్యక్ష పదవిని ముందుగా అనుకొన్నట్లుగా కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్‌ను వరించింది. ఆయన గతంలో టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పని చేశారు.
ఇకపోతే, మరో పెద్ద కార్పొరేషన్ అయిన ఆర్టీసీ చైర్మన్ పదవి వర్ల రామయ్యకు దక్కింది. ఇటీవల ఆయనకు రాజ్యసభ సీటు వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ సమయంలో ఆయన సంయమనం పాటించి క్రమశిక్షణతో వ్యవహరించినందుకు ఇప్పుడు మరో పెద్ద కార్పొరేషన్ పదవి లభించింది. ఇక... ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో మరో దళిత నేత జూపూడి ప్రభాకరరావును కొనసాగించారు. మాదిగ సామాజిక వర్గం ఒత్తిడితో ఈసారి ఈ కార్పొరేషన్ అధ్యక్ష పదవిని మార్చాలని అనుకొన్నా... ఆ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యకు మరో పెద్ద కార్పొరేషన్ పదవి ఇవ్వడంతో జూపూడిని ఇందులో కొనసాగించాలని నిర్ణయించారు.
అలాగే, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డికి సాగునీటి అభివృద్ధి సంస్థ అధ్యక్ష పదవి లభించింది. ఆయన ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయన చేరికతో పశ్చిమ చిత్తూరులో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రావడంతో... మరింత ప్రోత్సహించేలా ఈ పదవి ఇచ్చారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు అనూహ్యంగా కాపు కార్పొరేషన్ అధ్యక్ష పదవి వరించింది. రాజకీయంగా కీలకమైన ఈ కార్పొరేషన్‌కు ఎవరినైనా సీనియర్‌ను నియమించాలని అనుకొన్న పార్టీ అధిష్ఠానం... సుబ్బారాయుడును ఒప్పించి ఆయనకు ఈ పదవి ఇచ్చింది. అలాగే, ఇతర సంస్థలకు కూడా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలను నియమిస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు.