తిరుమలలో భక్తజన జనసంద్రం... గరుడ వాహనంపై శ్రీవారు

సోమవారం, 17 సెప్టెంబరు 2018 (21:18 IST)
కలియుగ వైకుంఠం భక్తజన సంద్రమైంది. లక్షలాది మంది భక్తులతో అనంత భక్త సాగరాన్ని తలపించింది. గోవిందా.. గోవిందా అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున రాత్రి తిరు వేంకటనాథుడు తన అనుంగు వాహనమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు ఉదయం నుంచి తిరుమలకు చేరుకున్నారు. 
 
అన్నమయ్య పేర్కొన్నట్టు ‘‘ నానా దిక్కుల నరులెల్లా..’’ రీతిలో లక్షలాది మంది భక్తజనం రావడంతో తిరుమల కొండలు భక్తగిరులుగా మారిపోయాయి. గరుడ సేవలో ధ్రువమూర్తి వేంకటేశ్వరస్వామికి, ఉత్సవమూర్తి మలయప్పస్వామికి భేదం లేదు. అందుకనే ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై ఉండగా వీక్షించడం మోక్షదాయకం. మూల విరాట్టుకు నిత్యం అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల వంటి విశిష్ట అభరణాలను మలయప్పకు అలంకరిస్తారు. 
 
గరుడోత్సవాన్ని వీక్షిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శ్రీవిల్లిపుత్తూరు ఆలయం నుంచి పూలమాలలు, చెన్నై నుంచి గొడుగులను తిరుమలకు తరలించి గరుడోత్సవానికి ఉత్సవమూర్తికి అలంకరించడం విశేషం. గరుత్మంతుడు విష్ణువుకు వాహనం. అలాగే ధ్వజం కూడా. బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజస్తంభంపై నుంచి యావత్‌ దేవతలకు ఆహ్వానం పలుకుతాడు. విష్ణు పురాణాన్ని శ్రీ వైకుంఠనాధుడు తొలిసారిగా గరుడినికే ఉపదేశించాడు. ఇన్ని విధాలుగా గరుడసేవ విశిష్ట సేవగా గుర్తింపబడింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు