చేతులు వెనక్కి విరిచి కట్టేశాం.. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది.. ఏంటిరా? ఆ ధైర్యం.. 'సైరా' డైలాగ్
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:21 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహా రెడ్డి". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 21వ తేదీన చిరంజీవి పుట్టినరోజును పునస్కరించుకొని రిలీజ్ చేశారు.
ఈ టీజర్ సోషల్ మీడియాలో పెను సునామీనే సృష్టించింది. కేవలం 24 గంటల వ్యవధిలో 12 మిలియన్ డిజటల్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఆ చిత్ర స్క్రిప్టు రైటర్ పరుచూరి బ్రదర్స్‌లలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ లీక్ చేశారు. తాజాగా పరచూరి గోపాలకృష్ణ పరచూరి పలుకులు అనే కార్యక్రమంలో పవర్‌ఫుల్ డైలాగు గురించి చెప్పారు.
'చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది. ఏంటిరా? ఆ ధైర్యం.. చావు భయం లేదా నీకు?' అని అంటే 'చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని చావంటే నాకెందుకురా భయం' అనే డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్ మెగా అభిమానులలో జోష్ నింపడం ఖాయం అని అంటున్నారు.
12 ఏళ్ళ తర్వాత పరచూరి బ్రదర్స్ సైరా చిత్రానికి కథ అందిస్తున్నారు. ఈ క్రమంలో వారు రోమాలు నిక్క పొడుచుకునేలా డైలాగులు రాస్తున్నారు. అలాగే, బుర్రా సాయి మాధవ్ కూడా సైరా కోసం మరికొన్ని పవర్‌ఫుల్ డైలాగులు రాస్తున్న విషయం తెల్సిందే.