20న మహా ప్రస్థానంలో హీరో తారకరత్న అంత్యక్రియలు

ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (08:47 IST)
తీవ్ర అస్వస్థతకులోనై బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో గత 23 రోజులుగా చికిత్స పొందుతూ వచ్చిన టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని మహాప్రస్థానంలో జరుగనున్నాయి. ఇందుకోసం ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
 
మరోవైపు, తారకరత్న భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం బెంగుళూరు నుంచి హైదరాబాద్ నగరానికి ఎయిర్ అంబులెన్స్‌లో రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలోని ఆయన నివాసానికి చేరుకుంది. సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలిస్తారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంచి ఆ తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27వ తేదీన కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఇందులో పాల్గొనేందుకు వెళ్లిన తారకరత్న తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించి ఆ తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, గుండెపోటు సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాల పాటు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్టు వైద్యులు గుర్తించారు. దీనికి సంబంధింత వైద్య నిపుణులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఓ దశలో తారకరత్నను విదేశాలకు సైతం తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. 
 
ఆ తర్వాత విదేశాల నుంచే వైద్యులను బెంగుళూరుకు రప్పించారు. కానీ, అందరినీ విషాదంలో ముంచెత్తుతూ తారకరత్న తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. గత 23 రోజులుగా ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన కృషి విఫలమైంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు