నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన నేత ఆనం వివేకానంద రెడ్డి, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు మంత్రిపదవి వరిస్తే తన జల్సాల కోసం ఆ పదవిని తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డికి ఇప్పించారు. అలాంటి ఆనం వివేకా బుధవారం క్యాన్సర్‌తో చనిపోయారు. ఆయన అంత్యక్రియలు గురువారం నెల్లూరులో జరుగనున్నాయి.
అయిదే, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించిన మహానటుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు. అలాంటి వ్యక్తితో కాంగ్రెస్ పార్టీకి జైకొట్టించి.. తెలుగుదేశం పార్టీని ఓడించిన రాజకీయ చతురుడు ఆనం వివేకా. వివరాల్లోకి వెళ్తే, 1995 నవంబర్ 23న మునిసిపల్ స్టేట్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. అప్పటికే ఎన్టీఆర్‌తో విభేదించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. స్టేట్ ఛాంబర్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ తరపున వివేకా, టీడీపీ అభ్యర్థిగా మనోహర్, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున అప్పటి బాపట్ల మున్సిపల్ ఛైర్మన్ వెంకట్రావు పోటీపడ్డారు.
ఈ మూడు పార్టీలు బరిలో ఉంటే టీడీపీ ఖచ్చితంగా గెలిస్తుందని భావించిన ఆనం వివేకా... నేరుగా ఎన్టీఆర్‌ను కలిశారు. పరిస్థితిని ఆయనకు వివరించారు. ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థిని ఉపసంహరించుకుని, కాంగ్రెస్‌కు మద్దతు పలికితే చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థిని ఓడించవచ్చన్న ఐడియా ఇచ్చారు. వివేకా మాటలను విశ్వసించిన ఎన్టీఆర్... తమ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించారు. దీంతో, ఛాంబర్ అధ్యక్షుడిగా ఆనం వివేకానంద రెడ్డి విజయబావుటా ఎగురవేశారు.
అంతేనా, చంద్రబాబుతో నామినేషన్ వేయకుండా ఒప్పించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 1976లో రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన వివేక... 2014 వరకు తన కుటుంబ సభ్యుల ఎదుగుదలకు కృషి చేస్తూనే ఉన్నారు. 1976లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి తన అన్న కుమారుడు భక్తవత్సల రెడ్డి పోటీ చేశారు. ఆ నియోజకవర్గం కింద నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉండేవి.
అదే స్థానానికి ఎస్వీయూ విద్యార్థి నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నామినేషన్ వేయడానికి నెల్లూరుకు వచ్చారు. అయితే, చంద్రబాబుతో మాట్లాడి, ఆయన నామినేషన్ వేయకుండా వివేక ఒప్పించారు. కానీ, ఆ ఎన్నికల్లో భక్తవత్సల రెడ్డి ఓడిపోయారు. 1983లో టీడీపీలో చేరి తన తండ్రి వెంకటరెడ్డికి ఆత్మకూరు, తమ్ముడు రాంనారాయణరెడ్డికి నెల్లూరు టికెట్లు ఇప్పించుకుని, గెలిపించుకున్నారు. చంద్రబాబు, వైయస్‌లతో వివేకాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.