ఆపరేషన్ గరుడ పేరిట.. సినీనటుడు శివాజీ చెప్తున్నవన్నీ వాస్తవమేననిపిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని శివాజీ చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. మార్చిలోనే శివాజీ ఈ విషయాలను చెప్పారని.. ప్రస్తుతం జరగుతున్న పరిస్థితులు చూస్తే వాస్తవమనిపిస్తోందని బాబు వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ దాడులు మరింతగా జరిగే అవకాశం ఉందని బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న చంద్రబాబు నాయడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత తమపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ నాయకులే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్ని దాడులు జరిగినా తాము భయపడేది లేదని ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడతానని తప్పుడు రాజకీయాలు చేసి తమను ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలుగు జాతి పౌరుషం చూపిస్తామని కేంద్రానికి చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక దాడి జరిగిన తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్‌కు బాగానే వెళ్లిన వైకాపా చీఫ్ జగన్ అక్కడ డ్రామా మెుదలు పెట్టారని ఆరోపించారు. జగన్‌తో మాట్లాడాలని ప్రయత్నిస్తే తానే ఏ వన్ ముద్దాయి అంటూ వైసీపీ ఆరోపించిందని చంద్రబాబు తెలిపారు.