వచ్చే యేడాది జనవరి 3,4,5 తేదీలలో జరగబోయే 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
భారతీయ విద్యా భవన్, గుంటూరు ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహా సభల "ప్రచార పత్రిక"ను కేంద్రమంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఈ సభలను ఆంధ్ర సారస్వత పరిషత్తు 'ఆంధ్ర మేవ జయతే' అనే నినాదంతో నిర్వహిస్తున్న తెలుగు పండుగ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గుంటూరు, అమరావతి జరుగనుండడం అందరికీ గర్వకారణమన్నారు.
తాను తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేశానని, శ్రీ కృష్ణ దేవరాయలు, తెనాలి రామకృష్ణ, వాగ్గేయకారులు, అన్న ఎన్.టీ.ఆర్ లాంటి మహానుభావుల స్ఫూర్తి మనమందరమూ కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. గొప్ప విద్యా, అధ్యాత్మిక కేంద్రమైన గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణం 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు వేదిక కావడం మాకు ఎంతో ఆనందం వుందని శ్రీ సత్యసాయి విద్యాసంస్థల చైర్మన్, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు.
పరిషత్తు అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు వేదికపై ఆంధ్ర సాంస్కృతిక, సాహితీ వైభవాన్ని, తెలుగు భాషా వెలుగులను దశ దిశలా ప్రసరింపజేసేదిశగా సభలు నిర్వహిస్తామని, లక్షలాది మంది యువతీ యువకులు సాంస్కృతిక ప్రదర్శనలలో పాల్గొని తెలుగు భాషకు నూతన ఉత్తేజం కలుగజేస్తారని ఆయన తెలిపారు. ముఖ్య సమన్వయకర్త పి.రామచంద్ర రాజు వందన సమర్పణ చేశారు. ఈ సభలో కార్యదర్శి ధవేజి, ఉపాధ్యక్షులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, సహా సమన్వయకర్త వాసిరెడ్డి విద్యాసాగర్‌లు పాల్గొన్నారు.