ఇటీవల ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్.కె.రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె మొబైల్ ఫోను చోరీకి గురైంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తొలిసారి సొంత చిత్తూరు, సొంత నియోజకవర్గం నగరికి వచ్చారు. ఆ తర్వాత బుధవారం మంత్రి హోదాలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
గురువారం తిరుపతిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిమ్మట మధ్యాహ్నం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను సన్మానించేందుకు, అభినందించేందుకు ప్రభుత్వ అధికారులతో పాటు వైకాపా నేతలు పోటీపడ్డారు. దీంతో అతిథి గృహం వద్ద భారీ సంజన సందోహం ఏర్పడింది. ఇదే అదునుగా ఓ వ్యక్తి తన చేతివాటం ప్రదర్శించి రోజా మొబైల్‌ను చోరీ చేశారు.
ఇపుడు కారు నంబరు ఆధారంగా ఆ దొంగ కోసం పోలీసులు ఆరా తీయగా, ఆ వ్యక్తి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎస్వీ యూనివర్శిటీ ప్రాంగణంలోకి వెళ్లినట్టుగా గుర్తించి, అక్కడకు పరుగులు తీసి ఎట్టకేలకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఫోనును కూడా స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద జరిపిన విచారణలో అతను కాంట్రాక్టు ఉద్యోగి అని తేలింది. చోరీకి గురైన ఫోనును పోలీసులు మంత్రి రోజాకు అందజేయడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు.