వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించినట్లు పోలీసులు ఎవరికీ బానిసలు కారని.. కేవలం చట్టానికి మాత్రమే బానిసలని ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు డీజీపీ సాంబశివరావు బానిసలా వ్యవహరిస్తున్నారంటూ రోజా చేసిన వ్యాఖ్యలను శ్రీనివాసరావు ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా రోజా నోటిని అదుపులో పెట్టుకోవాలని శ్రీనివాసరావు సూచించారు.
మహిళల సదస్సును రోజా చెడగొడతారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని... అందుకే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రోజా వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. ఎవరేం చేశారనేది తమ రికార్డ్స్‌లో ఉంటాయని.. రోజా హుందాగా వ్యవహరించాలని శ్రీనివాసరావు సూచించారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు గాను రోజా వెంటనే క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారులు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల మహిళా పార్లమెంటు సదస్సుకు వెళ్తున్న రోజాను గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పోలీసులపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లు డీజీపీ వింటున్నారని.. పోలీసులు తనను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.