విశాఖ బీచ్ రోడ్డులో ఓ యువతి బైకుపై కూర్చొని మద్యం, సిగరెట్ తాగుతూ రోడ్డుపై వీరంగం సృష్టించింది. దీన్ని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు.. ఆ యువతిని మందలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే పీకల వరకు మద్యంమత్తులో ఉన్న ఆ యువతి.. పోలీసులపై విరుచుకుపడింది. ఏఎస్ఐను కాలితో తన్నింది. అడ్డుకున్న పోలీసులను బూతులు తిడుతూ.. ఏఎస్ఐని కాలుతో తన్ని శివాలెత్తింది. ఆమెను పోలీసులు అరెస్టు చేసిన స్టేషన్‌కు తరలించారు.
త్రీటౌన్ సీఐ కె.రామారావు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ డెయిరీ ఫారం ప్రాంతానికి చెందిన యువతి బుధవారం అర్థరాత్రి వేళ ద్విచక్ర వాహనంపై బీచ్ రోడ్డుకు వెళ్లింది. కురుపాం సర్కిల్ వద్ద రోడ్డుపై బైక్ పార్క్ చేసి అక్కడే మద్యం తాగడం మొదలెట్టింది. రోడ్డుపై నిల్చుని వాహనాలకు ఇబ్బంది కలిగిస్తుండడంతో కొంతమంది డయల్ 100కి సమాచారం ఇచ్చారు.
దీంతో ఏఎస్ఐ సత్యనారాయణ, మరొక కానిస్టేబుల్ అక్కడకు వెళ్లారు. వైఎంసీఏ వద్ద కనిపించిన యువతికి బ్రీత్ అనలైజర్‌తో తనిఖీ చేయగా 149 రీడింగ్ వచ్చింది. ఆమె వివరాలు తీసుకుని.. ఉదయం స్టేషన్‌కు వచ్చి బైక్ తీసుకువెళ్లాలని చెప్పారు. దీంతో ఆ యువతి రెచ్చిపోయింది. ఏఎస్ఐపైకి బీర్ బాటిల్ విసిరింది.
అది ఏఎస్ఐ పక్కనే ఉన్న గోవింద్ అనే యువకుడికి తగిలి, అతని ఎడమ కంటి వద్ద గాయమైంది. ఆ యువతి మరింత రెచ్చిపోయి.. ఏఎస్ఐను కాలితో పొట్టలో బలంగా తన్నింది. స్థానికుల సహాయంతో పోలీసులు ఆమెను త్రీటౌన్ స్టేషన్‌కు తరలించారు. ఆమెపై సెక్షన్ 353, 427 ఐపీసీతోపాటు సెక్షన్ 184, 185 ఎంవీయాక్ట్ కింద కేసు నమోదుచేశారు. కోర్టుకు హాజరుపరచగా రెండు వారాలు రిమాండ్ విధించిందని తెలిపారు.