తిరుపతిలో హిజ్రాలు ఏం చేశారో తెలుసా..!

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (14:21 IST)
"తామేమీ చేశాము నేరం.. తమకెందుకంటింది పాపం.. చినబోకుమా" అంటూ ఒక సినిమాలో పాటుంది. అదే ప్రశ్నలు ఇప్పుడు వారి నుంచి కూడా వినిపిస్తోంది. ఎంతో మందికి ఎన్నో రిజర్వేషన్లు ఇచ్చి ప్రత్యేక సదుపాయాలు కల్పించి అందరికీ అండగా ఉంటున్న ప్రభుత్వాలు తమ విషయంలో మాత్రం ఇప్పటికే చిన్నచూపే చూశాయంటున్నారు. ఒకవైపు లోకం నుంచి ఈసడింపులు, చీత్కారాలు ఎదుర్కొంటూ బతుకుతున్నతమకు ప్రభుత్వం నుంచి ఎందుకు అండదండలు అందడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. తమనూ ఒక ప్రత్యేక కేటగిరీగా చూడమంటూ సుప్రీంకోర్టే ఆదేశించినా ఆదుకునే వారు కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 
 
హిజ్రాలు.. ఈ పేరువింటేనే చాలామందికి ఒకరకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఈసడింపులు, ఎటకారపు మాటలు ఎక్కడ చూసినా ఇదే వాళ్ళకు ఎదురయ్యే పరిస్థితులు. అయినా అన్నింటిని తట్టుకుని ఎదిగిన వారు ఎందరో. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలలోను తమ సత్తాను చాటుకుంటున్న హిజ్రాలు ప్రభుత్వం నుంచి భరోసా కావాలని అడుగుతున్నారు. తిరుపతిలోని ఎస్వీయూనివర్సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిజ్రాలందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను వినిపించారు. 
 
తమకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాలని, హిజ్రాలుగా పుట్టినందుకు కనీసం ఆధార్ కార్డు, ఓటర్ కార్డుకు కూడా కనీసం నోచుకోకపోతున్నామని, సమాజంలో తమను పౌరులుగా పాటించడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. తమను ప్రత్యేక కేటగిరీగా చూడడంతో పాటు రిజర్వేషన్లు కల్పించి అన్నింటిలోను సమాన హక్కులను పొందేవిధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే తాము చేసే నిరసనలకు ఈ ప్రభుత్వాలు తట్టుకోలేవని హెచ్చరిస్తున్నారు. సమాజంలో తమను అవమానించేవారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీసుకురావాలంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి