ఎవర్నీ అడిగినా బాబుకే ఓటు వేస్తామంటున్నారు.. ప్చ్: మంత్రి ధర్మాన

ఠాగూర్

మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (09:47 IST)
రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తావంటూ ఏ ఒక్కరినీ అడిగినా బాబుకే ఓటు వేస్తామని అంటున్నారని, మన గుర్తు ఏదని అడిగితే సైకిల్ లేదా హస్తం అని చెబుతున్నారని వైకాపా సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. పైగా, చాలా మందికి మన పార్టీ గుర్తు ఇంకా ఏదనే విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ప్రయోజనం ఏంటని, కనీసం పార్టీ గుర్తును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని ఆయన నిర్వేదం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగర పరిధిలోని బలగ, శ్రీకాకుళం రూరల్ మండలం తండేంవలస పంచాయతీ బెండవానిపేటలో సోమవారం వైకాపా శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి పేరాడ తిలక్‌తో కలిసి మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రచారం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యుద్ధానికి సిద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికీ చాలా మందికీ పార్టీ గుర్తు ఏంటో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీకి ఓటేస్తారని అడిగితే చాలామంది బాబుకే వేస్తామని సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ బాబుకు ఓటేస్తారని మళ్లీ అడిగితే సైకిల్ లేదా హస్తం అని అంటున్నారని విచారం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే విశాఖ రాజధానిని చేస్తామని మంత్రి ధర్మాన మరోమారు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం గమనార్హం. 
 
పిఠాపురంలో 54 గ్రామాలు ఉన్నాయి.. ఏదో ఒక గ్రామంలో స్థిరనివాసం : పవన్ కళ్యాణ్
 
తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 54 గ్రామాలు ఉన్నాయిని, ఏదో ఒక గ్రామంలో తాను స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసన సభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో పాటు పలువురు నేతలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, జనసేనను, తమ పార్టీ విధి విధానాలను అర్థం చేసుకుని పార్టీలో చేరిన ఇతర పార్టీల నేతలు, న్యాయవాదులు, మేధావులు, విభిన్న వర్గాల ప్రజలకు స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. 
 
పిఠాపురం నియోజకవర్గం నుంచి తనను, కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్‌ను గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా పిఠాపురంను తీర్చి దిద్దుతానని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో 54 గ్రామాలు ఉన్నాయని, వాటిలో ఏదో ఒక ఊరిలో ఇల్లు తీసుకుంటానని చెప్పారు. పగిలే కొద్దీ పదునెక్కేది గ్లాసు.. గ్లాసుకు ఓటేయండి.. జనసేనను గెలిపించండి అని ఆయన పిలుపునిచ్చారు. పైగా, వైకాపాకు సౌండ్ ఎక్కువ... గాలి తక్కువ.. అది ఓడిపోయే పార్టీ అని ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు