'గ్రేటర్‌'లో కారుకు ముచ్చెమటలు పోయించిన బీజేపీ... ఇపుడు తిరుపతిపై గురి!

ఆదివారం, 6 డిశెంబరు 2020 (10:09 IST)
ఇపుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార తెరాసకు భారతీయ జనతా పార్టీ ముచ్చెమటలు పోయింది. ఈ ఎన్నికల్లో తెరాస గుడ్డిలో మెల్లగా బయటపడింది. మొత్తం 150 డివిజన్లకుగాను తెరాస 56 చోట్ల, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 చోట్ల గెలుపొందాయి. ఇక్కడ తెరాస అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ... బీజేపీ మాత్రం అధికార పార్టీకి చుక్కలు చూపించింది. 
 
ఈ ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపక్షాల్లో అంతర్మథనం మొదలైంది. రానున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డాయి. సోషల్​ ఇంజినీరింగ్, ఓట్ల పునరేకీకరణతో విజయఢంకా మోగిస్తామని బీజేపీ, జనసేన పార్టీలు జోష్​తో ఉండగా, సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయనే భరోసాతో అధికార వైసీపీ ఉంది. 
 
మరోవైపు బీజేపీ విధానాలపై ప్రతిపక్ష టీడీపీ గొంతు సవరించుకుంటోంది. ఢిల్లీలో ఉత్తరాది రైతులు చేస్తున్న ఆందోళనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నోరు విప్పారు. మొత్తంగా పొరుగు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలతో ఏపీ రాజకీయాలు ఒకింత ఉలికిపాటుకు గురవుతున్నాయి.
 
అదేసమయంలో అధికార, విపక్షాల వైఫల్యాలతో తాము బలపడతామనే ధీమాతో బీజేపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. వైసీపీ, టీడీపీ తమను బలంగా విమర్శించలేని బలహీనతలతో రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి బీజేపీ అడుగులు వేస్తోంది. 
 
ఈపాటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి ఆధ్మాత్మిక కేంద్రంలో ఏదైనా చర్చనీయాంశం చేయగల సత్తా తమకుందని బీజేపీ నిరూపించింది. అంతేకాకుండా, ఆలయాలపై దాడులను నిరోధించేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. 
 
వైసీపీ, టీడీపీలను కుటుంబ పార్టీలుగా ఎండగడుతోంది. ఆ రెండు సామాజిక వర్గాల పెత్తనాన్ని బాహాటంగానే విమర్శిస్తోంది. తద్వారా మిగతా ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకుంటోంది. దుబ్బాకలో అధికార పార్టీని ఓడించారు. గ్రేటర్​హైదరాబాద్​ ఎన్నికల్లో నాలుగు సీట్ల నుంచి 48 సీట్లకు ఎగబాకారు. 
 
ఇదే ఊపుతో తిరుపతిలోనూ పాగా వేస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీతో కొనసాగడం ద్వారా తన బలాన్ని పెంచుకోవాలని జనసేన ప్రయత్నిస్తోంది. మొత్తానికి రాబోయే స్థానిక, ఉప ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎత్తుగడలను రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు