'గ్రేటర్‌' పోరు : పావు శాతం ఓట్ల తేడాతో 11 సీట్లు కోల్పోయిన బీజేపీ!

శనివారం, 5 డిశెంబరు 2020 (09:36 IST)
దేశంలో తీవ్ర ఉత్కంఠను రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. మొత్తం 150 వార్డులకుగాను 149 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో అధికార తెరాస పార్టీకి 55 స్థానాలు దక్కాయి. దీంతో తెరాస అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, గత 2016 ఎన్నికలతో పోల్చితే టీఆర్ఎస్‌కు ఇవి చేదు ఫలితాలు.
 
ఇకపోతే, తెరాసకు గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ 48 డివిజన్లు కైవసం చేసుకోవడం ఈసారి ఎన్నికల్లో హైలైట్ అని చెప్పవచ్చు. ఎప్పట్లాగే ఎంఐఎం తన హవా చాటుకుంటూ 44 డివిజన్లలో జయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. హస్తం పార్టీకి కేవలం 2 డివిజన్లలో తప్ప ప్రతిచోటా నిరాదరణే ఎదురైంది.
 
అసలు విషయానికొస్తే... జీహెచ్ఎంసీలో ఈసారి హంగ్ తప్పదని తేలిపోయింది. మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు కాగా, ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఆ మార్కు చేరుకోలేకపోయింది. దాంతో మేయర్ పదవి కోసం ఎంఐఎం మద్దతు కీలకం కానుంది. బీజేపీ... ఎంఐఎం మద్దతు కోరే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలుస్తాయా అన్నదానిపై ఆసక్తి నెలకొంది
 
ఇదిలావుంటే, తెరాస అతిపెద్ద పార్టీగా నిలిచి 55 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, ఓట్ల శాతం పరంగా చూస్తే కనుక, బీజేపీ అతిదగ్గరలోనే ఉంది. ఈ ఎన్నికల్లో తెరాసకు 12,04,167 ఓట్లు రాగా, బీజేపీకి 11,95,711 ఓట్లు వచ్చాయి. 
 
ఓట్ల శాతం పరంగా చూస్తే, మొత్తం పోలైన ఓట్లలో 35.81 శాతం టీఆర్ఎస్‌కు రాగా, 35.56 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. అంటే, రెండు పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా శాతం కేవలం 0.25 మాత్రమే.
 
ఈ పావు శాతం ఓట్ల తేడాతోనే... అంటే కేవలం 8,456 ఓట్లు తగ్గిన కారణంగానే కమలనాధులు 11 సీట్లను కోల్పోయారు. ఇక ఇదే సమయంలో ఎంఐఎంకు 18.76 శాతం ఓట్లతో మొత్తం 6,30,866 ఓట్లు వచ్చాయి. 
 
ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి 6.67 శాతం ఓట్లతో 2,24,528 ఓట్లు వచ్చాయి. ఇక పోటీ చేసిన అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయిన టీడీపీకి 1.66 శాతం ఓట్లు మాత్రమే... అంటే 55,662 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
 
గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 43.85 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు దాదాపు 8 శాతం ఓట్లు తగ్గాయి. 2016లో వచ్చిన ఓట్లతో పోలిస్తే, టీఆర్ఎస్‌కు ఇప్పుడు 2,64,451 ఓట్లు తగ్గాయి. 
 
ఇదే‌సమయంలో 2016లో 10.34 శాతం ఓట్లను సాధించిన బీజేపీ ఇప్పుడు మరో 25 శాతం మేరకు ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. పాతబస్తీకి మాత్రమే పరిమితమైన ఎంఐఎం ఓట్ల శాతం స్వల్పంగా పెరిగింది. అప్పట్లో 15.85 శాతం ఓట్లను సాధించిన ఎంఐఎం ఓట్ల శాతం ఇప్పుడు 18.76 శాతానికి పెరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు