బీట‌లు వారిన ఏపీ బీజేపీ... టీడీపీ పిచ్చ హ్యాపీ!

బుధవారం, 5 అక్టోబరు 2016 (13:24 IST)
విజయవాడ:  టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చ‌ంద్ర‌బాబు ఏం చేసినా... దానికో ప‌ర్ప‌స్ ఉంటుంది. దాని వెనుక పెద్ద స్ట్రాట‌జీ ఉంటుంది. ఇపుడు ఏపీ బీజేపీలో అదే ప‌నిచేసింది. కేంద్రంలో బీజేపీతో టీడీపీ భాగ‌స్వామ్యం అయింది. దానికి ప్ర‌తిగా అటు కేంద్రంలోనూ ఏపీలోనూ రెండు పార్టీలు మంత్రి ప‌ద‌వులు పొందాయి. కానీ, ఏపీలో మాత్రం బీజేపీని ఎద‌గ‌నివ్వ‌కుండా చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో ప్లానింగ్‌లో ఉన్నారనే వాదనలు ఉన్నాయి. అందులో భాగంగా ఆయ‌న కేంద్ర నేత వెంక‌య్య‌నాయుడును న‌మ్ముకున్నారు. ఆయ‌న ఉండ‌గా, ఇక ఏపీలో టీడీపీకి తిరుగుండ‌దు. 
 
అందుకే చంద్రబాబుకు బీజేపీ అంటే, ఏపీలో ఒక్క వెంక‌య్య‌నాయుడే. ఆయ‌న ఒక్క‌డిని గౌర‌విస్తూ, మిగ‌తా పార్టీ వారిని అంతా తొక్కేసే ప్ర‌య‌త్నం టీడీపీ చేసింది. ఇందులో భాగంగా ఇపుడు ఏపీలో బీజేపీ బీట‌లువారే దుస్థితి నెల‌కొంది. మిత్రపక్షంగా వున్న బీజేపీకి నామినేటెడ్ పోస్టుల్లో ఏమాత్రం స్థానం క‌ల్పించ‌కుండా, టీడీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హరించ‌డాన్ని నిరసిస్తూ చేసిన ఆందోళనకు మద్దతు ఇవ్వకపోగా, విజయవాడ సిటీ బీజేపీ అధ్యక్షుడు ఉమమేహేశ్వర రాజును సస్పెండ్ చేశారు. 
 
ముందుగా షో కాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా డి.ఉమామహేశ్వర రాజును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు సస్పెన్షన్ చెయ్యటం చెల్లదని పార్టీ కార్య‌క‌ర్త‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. బీజేపీ నేత‌లు త‌మ ఇష్టానుసారంగా పని చెయ్యటం ఏపీలో బీజేపీకి తూట్లు పొడ‌వ‌డ‌మేన‌ని ఆగ్రహంతో వున్నారు.
 
సస్పెన్షన్‌కి గురైన ఉమామహేశ్వరరాజు స్పందిస్తూ, నామినేటెడ్ పోస్టులలో పార్టీని నిర్ల్యక్షం చేసిన వారిని ప్రశ్నించటం తప్పా అని కన్నీళ్ల పర్యంతమయ్యారు. అధ్యక్షుడు కంభంపాటి రామమోహన రావు ఏక పక్ష నిర్ణయం వలన పార్టీ బలహీనపడుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజధాని నగరం అమరావతిలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం ఆయనకు ఎందుకో నచ్చ‌టంలేదని అయన వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదోక విధంగా బీజేపీని రాష్ట్రంలో బలహీనపరిచేందుకే ఇలాంటి అనైతిక ఏకపక్ష  చర్యలకు పాల్పడుతూ పార్టీకి చేటు చేస్తున్న హరిబాబుని పార్టీ అధ్యక్ష స్థానం నుండి తొలగించాలని పలువురు కార్యకర్తలు, రాజు అనుయాయులు అధిష్టాన్ని డిమాండ్ చేస్తున్నారు.ఏమైనా అధిష్టానం త్వరగా ఈ విషయాలపై సరైన రీతిలో వెంటనే స్పందించకుంటే బీజేపీ ఏపీలో బీట‌లు వారే దుస్థితి ఏర్ప‌డుతుంది.

వెబ్దునియా పై చదవండి