టీడీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం... పొత్తు వద్దనే వద్దు : అమిత్ షా వద్ద బీజేపీ నేతల మొర

గురువారం, 25 మే 2017 (12:16 IST)
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. అమరావతి రీజియన్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకత ఉంది.. అందువల్ల టీడీపీతో ఉన్న చెలిమికి టాటా చెప్పేద్దాం అంటూ ఏపీ పర్యటనకు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వద్ద బీజేపీ నేతలు మొత్తుకున్నట్టు సమాచారం. 
 
తెలంగాణ రాష్ట్ర పర్యటనను ముగించుకుని విజయవాడకు వచ్చిన అమిత్ షాను కలిసిన బీజేపీ నేతలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పొత్తు వ్యవహారాలను చర్చిస్తూ, ఇటీవలి కాలంలో బీజేపీపై తెలుగుదేశం నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. టీడీపీతో పొత్తు వల్ల ఏపీలో బీజేపీ ఎంతో నష్టపోతోందని వారు వాపోయినట్టు సమాచారం. 
 
పొత్తు వద్దనుకునే విధంగా వారు మాట్లాడుతున్నారని, పొత్తు కారణంగా బీజేపీతో పోలిస్తే, తెలుగుదేశమే లాభపడిందన్న విషయాన్ని వారు మరచిపోయారని ఫిర్యాదు చేశారు. పలువురు నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం కాగా, అందరూ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి