దుబాయ్ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు చాలా బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అనేక మంది పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానిస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన యూఏఈలో 12 ప్రముఖ టెక్ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. "ప్రపంచ టెక్ గూగుల్ ఇప్పటికే విశాఖపట్టణాన్ని ఎంచుకుంది. మరి మీ సంగతేంటి?" అంటూ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జీ42ఏఐ సంస్థ ఇండియా సీఈఓ మనుకుమార్ జైన్ ఏర్పాటు చేసిన ఈ నెట్ వర్కింగ్ లంచ్, రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న పురోగామి విధానాలను, పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న వేగవంతమైన అనుమతుల గురించి సీఈఓలకు వివరించారు. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను, టెక్నాలజీ రంగంలో ఉన్న అపార అవకాశాలను ఆయన వారికి తెలియజేశారు.
అనంతరం, త్వరలో విశాఖపట్నంలో జరగనున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరుపేరునా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా లభించే అవకాశాలను స్వయంగా పరిశీలించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.