సత్యవేడు ఎమ్మెల్యే కోనేటికి ఏపీ హైకోర్టులో ఊరట - కేసు కొట్టివేత

ఠాగూర్

బుధవారం, 25 సెప్టెంబరు 2024 (13:17 IST)
ఏపీలోని అధికార టీడీపీ నుంచి సస్పెండ్‌కు లోనైన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తనను బెదిరించి అత్యాచారం చేశారంటూ తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలానికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ఆదిమూలంపై తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన విచారణలో ఆయన తరపు సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ.. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారని, మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్‌పై ఆ మహిళ ఫిర్యాదు చేశారని తెలిపారు. 'వలపు వల' (హనీట్రాప్‌)గా దీనిని న్యాయవాది పేర్కొన్నారు. అత్యాచారం సెక్షన్‌ నమోదు చెల్లదనీ.. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరారు. 
 
ఫిర్యాదు చేసిన మహిళ తరపున న్యాయవాది కె. జితేందర్‌ వాదనలు వినిపించారు. ఆ మహిళ కూడా స్వయంగా కోర్టుకు హాజరై.. ఆదిమూలంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని పేర్కొంటూ అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఎమ్మెల్యేపై కేసును కొట్టేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు